Monday 4 May 2015

ప్రయాణం

 అమ్మ అమృత గర్భంనుండి.
అంతిమ సత్యమైన నిన్ను చేరే ఈ సుదీర్ఘ ప్రయాణంలో ,,,
ఎదురయ్యేవెన్నిముళ్ళ దారులో,
సేదతీర్చే వెన్ని పూలతోటలో,..
ఎదవెలిగించే వెన్ని అనురాగాదీపాలో,
కళ్ళు తెరిపించేవెన్ని జ్ఞాన జ్యోతులో ,
అధివహించాల్సిన విజ్ఞాన శిఖరాలెన్నో,
అధః పాతాళానికి చేర్చే అరిషడవర్గాలెన్నో,
తెలిసీతెలియని వయసులో విలువలు తెలియక,
వృధా అయిన పుణ్య కాలాలెన్నో,!
స్వార్ధం రూపాంతరాలు చెంది,
సోమరితనం,వ్యామోహంగా,
కన్నులకు పొరలు గమ్మి,మయసభలో నడిపించిన
మాయ మజిలీలెన్నో,,!!!
ప్రకృతిని  పరిశీలించే ఓర్పు లేక ,నియమబధంగా నడిచే నేర్పులేక,
ఆదరాబాదరాగా అన్నీకావాలంటూఅడుసులో కాలువేసే ,,
ఈ అసహన యాత్రలో,,!!!,
మనోనేత్ర గోచరం గమ్యం,వాయువేగాన్వితం మనసు,
వాహకమైన దేహం,ప్రకృతి శక్తులవశం,
జయించలేని మనోనిగ్రహం,ఓడింది,ప్రతి,పరీక్షలో,,
ఎదురయ్యే పర్వత పంక్తుల్ని,అధివహించక తప్పదు,
దారిలోని సప్తసముద్రాలు దాటక తప్పదు,
చేసిన నేరాలన్నీ ముళ్ళుగా గుచుకుంటున్నా,
పశ్చాత్తాపంతో,శక్తి పున్జుకోక తప్పదు,
ఒకదానికొకటి విరుద్దమై,ఉక్కిరిబిక్కిరి చేస్తున్న
ఈజీవనసంగ్రామ సాహసయాత్రలో,!!!!,
అడుగడుగునా ఎదురయ్యే పద్మవ్యుహ విచ్చేదనలో,
అలసి సొలసిన మనసుకు తగిలిన
గాయాలనే గేయాలుగా పాడుతూ,
సాగే ఈ రాగస్రవంతిలో,!!!
చల్లని మలయమారుతంలా  హాయి కలిగించే వారెందరో,,
మరువలేని మధురగీతంలా కనుమరుగైనా స్మ్రుతిపదంలో,
నిలచిపోయే వారెందరో,
మానవత్వపు మకరందాలతో,స్నేహసుగందాలు వెదజల్లుతూ సాగే
ఈ పయనం,నిత్య ,నవ్యజీవనయానం,!!!!!!!













Thursday 30 April 2015

అమ్మ ఆవేదన.

నా కొంగు పట్టుకుని చుట్లు చుట్లు తిరిగిన రోజుల్లో,
అమ్మే అంతా అనుకున్నావు,ఇల్లే ప్రపంచం అనుకున్నావు..

ఇంటి గోడలు దూకి,రోడ్డున పడ్డావని,
ఎడమ,కుడి దారుల్లో ఇరుక్కు పోయావని,
నీవు దూరంగా వెళ్ళిన బాధ,
నీ నడతకు మమతలు పూసిన గాధ.

అల్లంత దూరాన నీవోక్కదివే,
చలికి దుప్పటి కప్పమని ,నిద్రకి జోకోట్టమని,ఎవరినడుగుతావు.?

నీ సన్నిహితుడు హితుడా,స్నేహితుడా అన్న వివేచన చెయ్యి,
బలహీన క్షణాలకు బానిస కాకు.

నీవేసిన ప్రతి అడుగు ప్రచ్చన్నంగా కాపాడుకో.
మూడు మ లని దరికిచేరనీయనని మాటివ్వు.

మనిషిని మనిషినించి దూరం చేస్తుంది డబ్బు,
నీది కానిదానిమీద ప్రణాళికలు వద్దు.

నీ స్వయంకృషి మీదనే నమ్మకం పెంచుకో,
ఎవరో ఆదుకుంటారని కాలయాపన కానీకు,
పరోపకారంలో పైచేయి కావాలికానీ.
పరాన్న జీవులకు పరపతి లేదేక్కడా.

కష్టమైనా నిష్టూరమైనా,నా మాటలు మనసులో మలచుకో,
అలసత్వం అధః పాతాళానికి తోసేస్తుంది తెలుసుకో.

సమయాసమయ విచక్షనలేక,ఆలోచనలు అనేయకు,
విడిచిన బానంలాగా,అన్న మాటకూడా ఆగిపోదుమరి.
చీకటి లేక విలువలేదు వెలుగుకి,
ఆవేదన లేక అర్ధం లేదు ఆనందానికి,
క్రమశిక్షణ లేక గెలుపు రాదు నడతకి,
కన్నీరు తప్ప ఏదీ కడగలేదు కనుగుడ్లని.
పూల పరిమళాలు పదిలంగా దాచుకో,,ముల్లునైనా మలచుకో నీ కనుగుణంగా,

నగరం నిగనిగలతోనిన్ను నుసి చేస్తుంది,
గమ్యాన్ని మరపించి,గాడి తప్పిస్తుంది.
వ్యధ చెందిన నీ తల్లి ఉత్తరం,వృధాప్రయాస కానీకు,
నీ నడతే తన ఊపిరైనతల్లిని కలతల పాల్చేయకు.

కన్నతల్లి మాటలు దీపానికే వెలుగిస్తాయి,!!
నీ కలలో అవి వలయాలై నిన్నే మెరిపిస్తాయి.!!!

నేటి యువతకి అంకితం.